ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ పర్యటనకు రావాల్సిన ఆరో తేదీనే.. ఆకస్మిక కార్యక్రమాలు ఏర్పడ్డాయా..? అంత ఆకస్మిక కార్యక్రమాలు కేరళకు వెళ్లడానికి అడ్డం పడలేదా..? జన సమీకరణ కష్టం అయ్యే పరిస్థితులు ఏర్పడటం.. నిరసనలు జరిగితే పరువు పోతుందనే భయం వల్లే మోడీ తన టూర్ వాయిదా వేసుకున్నారా..? కేంద్ర నిఘా వర్గాలు కూడా అదే చెప్పాయా? అసలు విషయం ఏంటి?
దేశ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న గుంటూరుకు వచ్చి రాష్ట్రానికి ఏం చేశామో చెప్తామని, అప్పుడు తెలుగుదేశం బండారం బయటపడుతుందంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రధాని పర్యటన తరువాత ఏపీలో బీజేపీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని వారు అన్నారు. ప్రధాని మోదీ హాజరుకాబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే మోదీ ఏపీ టూర్ వాయిదా పడినట్టు సమాచారం వచ్చేసింది. వేరే కార్యక్రమాలు ఉన్నందున ఏపీ పర్యటన వాయిదా వేసినట్టు బీజేపీ నేతలు చెబుతున్నా… అసలు మోదీ ఏపీ టూర్ రద్దు కావడం వెనుక అసలు కారణం నిఘా వర్గాల హెచ్చరికలే అని తెలుస్తోంది.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీసులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అయితే ప్రధాని భద్రతకు ఎలాంటి డోకా లేనప్పటికీ సభలో ఇతర పార్టీలకు చెందిన వాళ్లు వచ్చి ప్రత్యేక హోదా నినాదాలు, మోదీ వ్యతిరేక నినాదాలు చేసే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని, దీనిపై ఇతర భద్రతా వర్గాల నుంచి కూడా కేంద్రం సమాచారం తెప్పించుకుందని వాళ్లు కూడా ఇదే రకమైన నివేదిక ఇవ్వడం వల్లే ప్రధాని మోదీ ఏపీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి ఇవ్వవలసిన విభజన హామీలు ఇవ్వకుండా రాష్ట్రానికి వస్తే వచ్చే ఇబ్బందులు ఆయనకు ఎదురవుతాయని, మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తప్పక తెలుపుతాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మోదీ ఆంధ్రకు వెళ్లకుండా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. కొద్ది రోజుల కిందట.. ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు పర్యటనకు వెళ్లారు. అక్కడి ప్రజలు వ్యక్తం చేసిన నిరసన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆయన రోడ్డు మార్గం ద్వారా ఎక్కడా పర్యటించపోయినా.. మోడీ వెళ్లే ఆకాశమార్గంలో హెలికాఫ్టర్‌కు కూడా దారి లేకుండా… నల్ల బెలూన్లు గాలిలోకి వదిలారు.
ఇప్పుడు ఆంధ్రలో కూడా తమిళనాడు స్ఫూర్తి నిరసనలకు పార్టీలు, ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే మోడీ పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదని సూచించాయి. జనవరి ఆరవ తేదీన కేరళలో ఉదయం బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం ప్రధాని ఏపికి వచ్చి బహిరంగసభలో పాల్గొనాలి. అయితే కేరళలో వేదిక మారడంతో సాయంత్రానికి ఏపికి రావడం కష్టమవుతుందనే ఉద్దేశ్యంతోనే పర్యటన వాయిదా వేశారని చెబుతున్నప్పటికీ అసలు విషయం మాత్రం.. నిఘా వర్గాల నివేదికలు.. బీజేపీలో గ్రూపుల గొడవలు. ఏదో ఒక వరం ప్రకటించకుండా ఏపికి వస్తే నిరసన తప్పదని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే వాయిదా పడిందని అంటున్నారు.
అలాగే నిఘా వర్గాలు.. విభజన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసిన తర్వాత ఏపీకి రావాలని… పీఏంవోకి సమాచారం ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్ లేదా గిరిజన విశ్వవిద్యాలయం పై ప్రకటన చేస్తే బాగుంటుందని నేరుగా పీఎంవోకే లేఖ రాసినట్లు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబితే ప్రజలు నమ్మరని కూడా వారు ప్రధాని కార్యాలయానికి వివరించినట్లు తెలుస్తుంది.