సాధారణ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో పార్టీలు బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? అనే విషయాన్ని విశ్లేషించుకుంటున్నాయి. ఎలాగైనా మళ్లీ అధికారం దక్కించుకోవాలనే యోచనలో ఉన్న చంద్రబాబు.. సంక్రాంతికి తర్వాత తొలి షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. దీంతో, ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలంతా అధిష్టానంతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మంత్రి.. ఓ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతన్నారట. ఎవరా మంత్రి..? ఏమా సీటు..?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీటు కోసం తెలుగుదేశంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించే యోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా చేశారు చంద్రబాబు. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించాలని భావిస్తున్న చంద్రబాబుకు జమ్మలమడుగు సీటు పంచాయితీ కష్టతరంగా మారింది.
తమకంటే తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారు ప్రయత్నాల్లో ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వారితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన వ్యక్తి, టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం.. వైసీపీల కార్యకర్తలు పోటాపోటీగా ఉంటారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. 2009లో కూడా ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై 4000ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. 2014లో వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై 12,167ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. అంతకుముందు రామసుబ్బారెడ్డి రెండుసార్లు నియోజకవర్గం నుండి గెలిచారు.
అయితే ఎన్నికల అనంతరం ఆదినారాయణ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఇక్కడి నుంచి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామసుబ్బారెడ్డితో పాటు, వరుసగా గెలుస్తూ వస్తున్న ఆదినారాయణ రెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం బలం చాలా పెరిగింది. అయితే రెండు గ్రూపులుగా విడిపోవడంతో సీటు గురించి పోటీ పడుతున్నారు. వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ ఇద్దరి నేతలకు సరిబలం ఉంది. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై అధిష్టానం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, ఎవరికి టికెట్ ఇచ్చినా ఇద్దరు కలిసి పార్టీ గెలుపుకు పనిచేయాలనే భావనతో ఈ ఇద్దరు నేతలను సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా చర్చిస్తున్నాడు.
అయితే, వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ ఇద్దరి నేతలకు సరిబలం ఉంది. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై అధిష్టానం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, ఎవరికి టికెట్ ఇచ్చినా ఇద్దరు కలిసి పార్టీ గెలుపుకు పనిచేయాలనే భావనతో ఈ ఇద్దరు నేతలను సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరిని కడప పార్లమెంటుకు పోటీ చేయించాలని సీఎం గతకొంత కాలంగా భావిస్తున్నప్పటికీ, వీరు మాత్రం జమ్మలమడుగులో పోటీ చేసేందుకే పట్టబడుతున్నారు. అలాగే జిల్లాలో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతన్ని జమ్మలమడుగు అసెంబ్లీకి పంపి రామసుబ్బారెడ్డిని కడప లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ, అందుకు రామసుబ్బారెడ్డి ససేమిరా అంటున్నారట. అయితే చివరకు అధినేత నిర్ణయం ఆదినారాయణ రెడ్డి వైపు ఉంటుందో? లేక రామసుబ్బారెడ్డి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.