పిల్లలతో డబ్బు ఆదా చేయించడం ఎలానో తెలుసా!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తల్లిదండ్రులు పిల్లలకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలనుకుంటారు. దానికోసం ఎంతైనా కష్టపడతారు. వారు అడిగింది కాదనకుండా తెచ్చిపెడతారు. మీరూ ఇలా చేసే పేరెంట్స్‌ అయితే ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు కష్టం విలువ తెలియకుండా గారాబంగా పెంచితే డబ్బు గురించి పిల్లలకు ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా వివరించాలి. డబ్బు విషయంలో నేర్చుకునే మంచి అలవాట్లు తర్వాత వారి జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల అలవాట్లు.. పిల్లలపై చాలా త్వరగా పడతాయి. ఆర్థికపరమైన విషయాలను పిల్లలకు కచ్చితంగా వివరించాలి.
చిన్నప్పుడే పిల్లలకు ఓ డిబ్బీ(హుండీ)ని బహుమతిగా ఇచ్చి వారికిచ్చిన డబ్బులను అందులో వేస్తూ ఉండడం అలవాటు చేయాలి. ఈ డిబ్బీ ఆకర్షణీయంగా ఉండేలా చూసి ఇస్తే వారికీ ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల రంగుల రంగుల డిబ్బీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా ఇంటి ఖర్చుకు డబ్బులు ఇచ్చేటప్పుడు పిల్లలకు కూడా కాస్త డబ్బులు ఇచ్చి ఇది మీ డిబ్బీ కోసం అని చెప్పి వారి చేతికి డబ్బులు ఇచ్చి వారిచేతనే అందులో వేసేలా అలవాటు చేయాలి.
అలాగే పిల్లలు కొద్దిగా పెద్దవారైతే వారి పేరిట బ్యాంకులో ఖాతా తెరిచి ప్రతినెలా వారికిచ్చే పాకెట్ మనీ నుంచి కొంత జమచేసేలా చేయించవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు పిల్లల పేరిట బ్యాంకు ఖాతాను తెరవడానికి అనుమతినిస్తున్నాయి. పిల్లల చేతికి డబ్బు ఇవ్వకూడదనే అపోహ చాలామందికి ఉంది. ఇది నిజం కాదు. వారి చేతికి కాస్త డబ్బులు ఇచ్చి చేయాల్సిన పనులు చెప్పి డబ్బు మిగిలేలా చేయమని చిన్న చిన్న టాస్కులు పెట్టడం వల్ల వారు డబ్బును ఎలా ఖర్చుచేయాలో ఆలోచించి, డబ్బు మిగిలించాలన్న ఆశయంతో తెలివిగా ప్రవర్తిస్తారు.
ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అత్యవసర సమయాల్లో వారు ఎలా ప్రవర్తించాలో వారికే తెలుస్తుంది. ముందు ముందు ఇలాంటి విషయాల్లో వారి మెదడు చురుగ్గా ఉంటుంది. తల్లిదండ్రులు పెట్టిన టాస్కుల్లో గెలిస్తే వారి చేతికి కొంత మొత్తం కానుకగా ఇవ్వాలి. అలా వారిలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంచవచ్చు. అదీ ఓ క్రమశిక్షణలో.. పెద్దలు కూడా పిల్లల చేతికి ఇచ్చిన డబ్బు వారు ఎలా ఖర్చు పెడుతున్నారో ఓ కంట కనిబెడుతూ ఉండాలి. నెలాఖరులో వాటిలోని లోటుపాట్లను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంటే ఎంత డబ్బు వారు అనవసరంగా ఖర్చుపెట్టారు, ఎంత అవసరార్థానికి వాడుకున్నారు వంటివన్నమాట. ఒకవేళ పిల్లలు దుబారా చేశారని తెలిసినప్పుడు వారిని కోప్పడకుండా డబ్బు నిరుపయోగంగా మారిందని, దానివల్ల ఏర్పడే దుష్పరిణామాలను వారికి వివరించాలి. ఇది గుణపాఠంగా మారి మరోసారి ఇలాంటి పొరపాటు వారు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటారు.

Share.

Comments are closed.

%d bloggers like this: