కొత్త అవయవాల గుర్తింపుతో మానవ శరీర శాస్త్రం, వైద్య శాస్త్రాలలో చాలా మార్పులకు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త అవయవాలు పనిచేసే తీరు, ఇవి తమ చుట్టూ ఉన్న అవయవాలతో అనుసంధానమై ఉండడం, వాటి పనితీరును ప్రభావితం చేయడం వంటి అంశాల కారణంగా.. ఇతర అవయవాలకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
మిసెంటరీ అనే ప్రత్యేక అవయవాన్ని వైధ్యులు గుర్తించారు . మీసెంటరీని కొత్త అవయవంగా గుర్తించిన నేపథ్యంలో.. ఇప్పటికే దీనిపై వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించడం మొదలైందని, వైద్య పాఠ్య పుస్తకం గ్రేస్ అనాటమీలోకి కూడా మిసెంటరీ ఎక్కిందని శాస్త్రవేత్త కెల్విన్ కొఫె వెల్లడించారు. మిసెంటరీని విడిగా కొత్త అవయవంగా గుర్తించడం వల్ల పొట్ట, జీర్ణ వ్యవస్థల పనితీరు, సమస్యలు మారుతాయి. వాటికి వచ్చే వ్యాధులకు వినియోగించే ఔషధాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఇక ఇంటర్ స్టిటియం అనేది పూర్తిగా కొత్త అవయవం. శరీరంలో కణజాలాలు, అవయవాల మధ్య ద్రవ రూప రవాణా మార్గాలతో కూడిన ఈ వ్యవస్థ.. మన శరీరశాస్త్రం, వైద్య శాస్త్రాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశముంది. ఎందుకంటే మన శరీరంలో రక్తం, లింఫ్, ఇతర ప్రొటీన్లు, హార్మోన్ల రవాణా వంటి ఎన్నో కీలకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ కొత్త పరిశోధన వాటికి సంబంధించి మార్పులకు కారణమవుతుంది.శరీరంలో లింఫ్, రక్తం రవాణా మార్గాల ద్వారానే కేన్సర్, ఇతర వ్యాధులు ఒక చోటి నుంచి మరో చోటికి విస్తరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. తాజాగా ఇంటర్ స్టిటియం కూడా ఇందులో చేరనుంది