రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1,872.46 కోట్లు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ఉపాధి పథకంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1,872.46 కోట్లకు చేరింది. వీటిలో వేతన బకాయి రూ.542.11 కోట్లు, మెటీరియల్‌ బకాయి రూ.1,330.35 కోటు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ జనవరి 30న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను కలిసి ఉపాధి పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి రూ.350 కోట్లు విడుదల మాత్రమే విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. గత ఏడాది నవంబరు 15 అనంతరం నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేయలేదు. ఉపాధి పథకంలో భాగంగా రాష్రంలో ఇప్పటి వరకూ రూ.7,536.28 కోట్లు పనులు చేయగా వేతనాల మొత్తం రూ.3,973.21 కోట్లు, మెటీరియల్‌ మొత్తం రూ.3,563.07 కోట్లుగా ఉంది. వేతన బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్న జిల్లాల్లో అనంతపురం రూ.64.60 కోట్లు, చిత్తూరు రూ.59.35 కోట్లు, ప్రకాశం రూ.56.49 కోట్లు, విశాఖపట్నం రూ.55.64 కోట్లు, కర్నూలు రూ.50.10 కోట్లు ఉన్నాయి. మరోవైపు సాంకేతిక కారణాలతో వేతనాలు చెల్లింపులు నిలిచిపోవడం వల్ల కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

నగదు బదిలీ (డిబిటి)లో రూ.19.23 కోట్లు సస్పెండెడ్‌ మొత్తంగా ఉండగా, రిజెక్ట్‌ అయిన మొత్తం రూ.7.94 కోట్లు ఉంది. ఈ సమస్యను అధికారులు పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి

Share.

Comments are closed.

%d bloggers like this: