ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు(86) ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో అనారోగ్యం తో మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన సినిమా రంగం మీద మక్కువతో రచయితగా ఆపై దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ ఆయన విజయం సాధించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి శోభన్ బాబు లతో సినిమాలు రూపొందించారు.
చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇండస్ట్రీకి అందించారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్లను ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.