ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు(86) ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో అనారోగ్యం తో మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన సినిమా రంగం మీద మక్కువతో రచయితగా ఆపై దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ ఆయన విజయం సాధించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకి సంతాపదినం అంటూ పలువురు నటులు సినీ ప్రముఖులు రాజకీయ వేత్తలు ప్రగాడ సంతపాన్ని తెలిపారు. అందులో భాగంగా
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సిఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దర్శకుడు విజయ బాపినీడు గారి మరణంపై సంతాపం తెలియజేసిన డాక్టర్ మంచు మోహన్ బాబు గారు..
విజయబాపినీడు గారి మరణం నన్ను చాలా బాధించింది. ఆయనతో నా పరిచయం నేటిది కాదు. 1990 నుంచి విజయ బాపినీడు గారు నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు కూడా ఒకరు. ఆయన రామోజీరావు గారి మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతో మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. విజయ బాపినీడు గారు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..