దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ వ్యాప్తంగా 20 వ ధనికుడు..! మన దేశపు ఆగ్రా వ్యాపారవేత్త.. ఇక పేరు తో పరిచయం అవసరం లేని ఈ వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. ఇక ఇలాంటి వారి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు…అవును త్వరలో వీరి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాకి గతేడాది జూన్లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వీరి వివాహానికి తేదీ కరారు చేసినట్టుగా సమాచారం.
మార్చి 9 నుంచి వీరి ఇంట వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీ కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వానపు తొలి పత్రికను వినాయకుడి పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు పెళ్లి పత్రికలను ప్రముఖులకు అందించడానికి పయనమయ్యారు.