ఆపరేషన్ కమలం పేరుతో కాంగ్రెస్-జనతాదళ్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఆడియో టేపులతో సహా దొరికిపోయిన కర్ణాటక బీజేపీ నాయకుల నెత్తిన మరో పిడుగు పడింది. ఆడియో టేపుల వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన ఆ పార్టీని నిండా ముంచేసే మరో ఆడియో క్లిప్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ బీజేపీ ఎమ్మెల్యే జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు… జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగ చెప్పుకుంటున్న ఆ ఆడియో టేపులోని వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్నాయి.
త్వరలోనే మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ చనిపోతారని… ఆయన కుమారుడు కుమారస్వామి ఆరోగ్యం కూడా పెద్దగా బాగోలేదని ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. అంతేకాదు త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుందని ఆడియో టేపు వాయిస్‌లో ఉంది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో… జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో ప్రీతమ్ గౌడ గాయపడ్డారు. ఆయన ముఖం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. ఈ దాడి ఘటనపై ప్రీతమ్ గౌడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రాళ్లు విసిరిన వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకన్నారు. అయితే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి… జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాలను ఆడియో టేపులు కుదిపేయడం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.