ప్రముఖ వ్యాపార వేత్త జయరాం హత్య కేసు రోజురోజుకి ఒక కొత్త కోణంతో ముస్తాబవుతుంది. ఈ కేసులో ప్రతీ రోజు ఏదో ఒక కొత్త ట్విస్టు ఏదో ఒక కొత్త ముఖం బయటపడుతుంది. ఏ ఒక్కరినీ వదలటం లేదు సాధారణ వ్యక్తి, సెలబ్రిటీ, పోలీసులు, రౌడీలు, ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులు ఇలా అన్నీ వర్గాల వారు ఈ కేసులో బయటపడుతూనే ఉన్నారు.
కొత్తగా ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేరు బయటపడింది. విచారణకు రావాల్సిందిగా పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి 2004 నుండి 2009 వరకు కూన శ్రీశైలం గౌడ్ ప్రాతినిథ్యం వహించారు. జయరామ్ హత్యకు ముందు రోజు కూన శ్రీశైలం గౌడ్‌ను రాకేష్ రెడ్డి కలిశారని పోలీసులు గుర్తించారు.
ఈ కేసు విషయమై ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని పోలీసులు శ్రీశైలం గౌడ్ కు నోటీసులు పంపారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి శ్రీశైలం గౌడ్ ఓటమి పాలయ్యాడు. శ్రీశైలం గౌడ్‌తో పాటు మరికొందరు టీడీపీ నేతలను కూడ పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.