బడ్జెట్ సమావేశాల నిర్వహణకోసం అసెంబ్లీ అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. భద్రతాఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం సమీక్షించి, పోలీసులకు తగిన ఆదేశాలు జారీచేశారు. అయితే ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆరే అవ్వడం గమనార్హం స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సైజు భారీగా ఉండనున్నట్టు తెలుస్తున్నది. గత నాలుగేండ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా వృద్ధిచెందడం.. పన్నేతర రాబడి కూడా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగానే బడ్జెట్ పరిమాణం పెరుగుతున్నది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు సగటున 19% చొప్పున ఏయేటికాయేడు పెరుగుతున్నది. దీని ప్రకారంగానే ఈసారి బడ్జెట్ మొత్తం పరిమాణం రూ.2 లక్షల కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు.
రైతుబంధు పథకం కింద రూ.15వేల కోట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణమాఫీకి రూ. 20వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబీమాకు రూ.1500కోట్లు కేటాయించే అవకాశమున్నది. ఇక వైద్య ఆరోగ్యశాఖకు దాదాపు రూ.10వేల కోట్లు, బీసీలకు రూ. 5వేల కోట్ల నుంచి ఆరువేల కోట్ల వరకు, ఎస్సీలకు రూ.16వేల కోట్లు, ఎస్టీలకు రూ.9వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించే అవకాశముందని సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నది. 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ వానకాలం నుంచే గోదావరిలోని నీటిని ఎత్తిపోసుకొని తెలంగాణ భూముల్లో పారేలా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారు.