ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మదనపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను తాము కాపాడుకోగలమని అన్నారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ హైదరాబాద్‌లో ఉండి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు.
60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని.. ఇప్పుడు తనపై దాడులు చేయడానికి వస్తున్నారని, వారి గత చరిత్ర ఒక్కసారి ఆలోచించుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే సమస్యేలేదని ముఖ్యమంత్రి మదనపల్లి సభ ద్వారా మరోసారి హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవడానికి ఎవరనీ ఆయన ప్రశ్నించారు.
జగన్.. కేసీఆర్‌తో కుమ్మక్కై ఇద్దరూ లాలూచీ పడి టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, మీ మూలాలు కదిలిపోతాయని, ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. డేటా అనేది తమ సొంతమని, మీరెవరు అడగడానికి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా చట్టపరంగా తాను ముందుకు వెళతానని అన్నారు. ఎవడో దానయ్య పిర్యాదు చేస్తే.. మాపై యాక్షన్ తీసుకుంటారా? అంటూ సీఎం ధ్వజమెత్తారు. కొంతమందిని కిడ్నాప్ చేశారని, హైకోర్టులో పిటిషన్ వేస్తే వారిని వదిలిపెట్టారని.. ఇదెక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలో ఉంది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా? అని అడిగారు. కేసీఆర్ ఒక నియంత అనుకుంటున్నారని, అది తనవద్ద పనిచేయదని, ఈ విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.