విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి.. ఇలా అన్నీ దోచేస్తారని టీడీపీ నేతలపై ఆయన ఆరోపించారు. అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులని, అందుకే, చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారని, లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న ‘దొంగ’ అని ఆరోపించారు. ‘ఫినిష్ చంద్రబాబు పార్టీ, నో మోర్ చంద్రబాబు పార్టీ’ అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల ఇబ్బందులు తీర్చడానికే వైఎస్ జగన్ వస్తున్నారని మోహన్ బాబు చెప్పారు. ఊసరవెల్లి లాంటి బాబు పాలనలో రాష్ట్రం అన్యాయమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందన్నారు. వైఎస్ జగన్కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను మోహన్ బాబు కోరారు. జగన్ పదేళ్లుగా ఏకదాటిగా రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నారని.. 365 రోజుల పాటు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నారని చెప్పారు. జగన్కు అనుభవం లేదంటున్నారని.. కానీ, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే అనుభవం అదే వస్తుందని మోహన్ బాబు చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు కూడా అనుభవం లేదన్నారని.. కానీ, నటనలో తానేంటో ప్రూవ్ చేసుకున్నానని తెలిపారు. జగన్ కూడా అలాగే అనుభవం సంపాదిస్తారని చెప్పారు.