పాల్ కేకలు…ఒరేయ్ జగన్.. నా మీదే దాడి చేయిస్తావా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తాను గది తలుపు వేసేశానని పేర్కొన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

పాల్ చెప్పిన దాని ప్రకారం… శనివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో మీ ఫ్యాన్స్ సార్.. అంటూ కొందరు భీమవరంలోని ఆయన హోటల్ గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. రేపు ఉదయం 9.45 గంటలకు రండి.. మాట్లాడుకుందాం అని పాల్ వారికి సూచించారట. అంతలోనే వారు గదిలోకి దూసుకొచ్చేందుకు యత్నించారనీ, వాళ్లను జగన్ అనుచరులుగా గుర్తించి… తాను వెంటనే జాగ్రత్తపడి… గది తలుపు వేసేశానని పాల్ అన్నారు. కాసేపు అక్కడ ఎదురుచూసిన ముఠా… తాను ఎంతకీ తలుపు తియ్యకపోవడంతో అక్కడి నుంచీ వెళ్లిపోయారని తెలిపారు. ఇదివరకు తనపై ఆనంద్.ఇన్ హోటల్‌లో దాడి చేసేందుకు వచ్చిన గ్యాంగే ఇప్పుడు కూడా మళ్లీ వచ్చిందనీ, తనను చంపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పాల్. ఈ విషయాన్ని చెప్పి, తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరితే, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్ మెన్ ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. నిన్న రాత్రి దాడి జరిగే సమయంలో తన భద్రతాసిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కు వచ్చిన భీమవరం సీఐ కనీసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదని వాపోయారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పాల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఓరేయ్ జగన్.. దమ్ముంటే రారా.. నాతో డిబేట్ కు. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేను జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమే కాకుండా నా మీదే దాడి చేయిస్తావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని జగన్ గనుక ఏపీ సీఎం అయితే… రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని పాల్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయితే, అభివృద్ధి ఆగిపోతుందనీ, జనసేన, వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీకీ ఓటు వెయ్యొద్దనీ, ప్రజాశాంతికి మాత్రమే ఓటు వెయ్యాలని ఆయన కోరారు. ఎవరెలా వ్యవహరించినా తమ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు పాల్.

Share.

Comments are closed.

%d bloggers like this: