ఆయన చిత్ర రంగములో మూకీ రోజుల నాటి నుండీ ఉన్నారు. అప్పట్లో సినిమా బొమ్మకు మాటల్లేవు కాబట్టి తెర వెనుక మైక్ తో తెర మీద జరిగేదానికి అనుగుణంగా సంభాషణలు చెబుతూ ప్రేక్షకులను రంజింపజేయాలి. కష్టతరమైన పనే, అయితేనేం మెప్పించారు. ఆ తరువాత టాకీల్లోనూ కామెడీ పాత్రలతో స్వర్గసీమ, గృహప్రవేశం, లైలా మజ్ఞు ఇలా చాలా చిత్రాల్లో మెప్పించారు. తన పాటలు కూడా తనే పాడుకునేవారు ద్వంద్వార్థాల సంభాషణలతో మొదటి రోజుల్లో లాగించేసినా కాస్త చలాకీగా తరువాతి రోజుల్లో నటించారు. అదే ఆయన్ని ప్రఖ్యాత వాహినీ వారు తీసిన గుణ సుందరి కథలో నాయకుణ్ణి చేసింది. చిత్రం ఆద్యంతమూ గిడి గిడి అంటూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ పాటలు పాడి తనదైన చతురతతో మకర ద్వార ప్రవేశం చేసి రాజు వారి చికిత్సకు కావలసిన మహేంద్ర మణితో బాటు నిర్మాతలకు కాసులు, దర్శకునికి పేరు ప్రతిష్టలు ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగించారు. ఆ తరువాత రక్ష రేఖ, బాలరాజు, స్వప్న సుందరి, వాలి సుగ్రీవ ఇలా ఎన్నో చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు ప్రతిష్టలతో బాటు కార్లలో పెద్ద భవనల్లో నివసించారు.
ఎన్నో ఆశలతో ఆయన తీసిన పరమానందయ్య శిస్యులకథ 1950 బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడముతో ఒక్క సారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. ఎంతో కష్టపడి తారాస్థాయికి చేరుకున్న ఆతనికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తరువాత వచ్చిన హాస్యనటులకు పోటీగా నిలబడి మెప్పించలేక పోవడం కూడా మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి తోసి వేసింది. సినిమా అవకాశాలు సన్నగిల్లడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడముతో తనెంతో ఇష్టపడి కట్టుకున్న పెద్ద బంగళాని నటుడు ఎన్ టీ రామారావు గారికి అమ్మి వేశారు. అదే రామారావు గారు మద్రాస్ లో ఉన్నంతవరకూ నివసించిన ఇల్లు.
ఆయన ఆర్థిక్స్ పరిస్థితి చూసిన రామారావు 1957 లో తీసిన పాండురంగ మహాత్మ్యంలో అవకాశమిచ్చారు. ఆ తరువాత విజయావారి, అప్పు చేసి పప్పు కూడులో మామగాడు మహామోసగాడు అంటూ కడుపుబ్బా నవ్వించారు. 1961లో వచ్చిన సీతారామ కళ్యాణములోనూ మరో అవకాశం ఇచ్చారు రామారావు గారు, మరియు ఆయన్ని బాగా ఎరిగిన బి ఎన్ రెడ్డి గారు రాజమకుటము చిత్రములో రెండూ మంచి వేషాలే ఇచ్చారు, అవి విజయవంతమై ఆకట్టుకున్నా మళ్లీ అవకాశాలు రాలేదు.
పరిశ్రమలో విజయాలు ఉన్నంతవరకే ఆ తరువాత ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవ్వరూ. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం ఆయన్ని కుంగదీసింది. తెరపైన ఉన్నంతవరకే తారలు, నిజ జీవితంలో ఇబ్బందులు పడితే ఎవ్వరూ రారు. కారుల్లో తిరిగిన ఆయన్ని చూస్తే జనాలు వెంటబడేవారు అప్పటిలో. సినిమా అవకాశాల్లేక మళ్లీ నాటకాల్లోకి వెళ్లిన ఆయనకు పొట్టగడిచేదానికి ఉపయోగపడిందే గానీ ఏమీ మిగల్లేదు. కారుల్లో తిరిగిన చోటునే సైకిల్లో తిరిగిన ఆయన తెనాలిలో ఓ నాటకములో నటించడానికి వెళ్లి అక్కడే మరణిస్తే కారు డిక్కీలో మూడు రోజుల తరువాత వారి కుటుంబానికి మృతుదేహాన్ని అందజేశారు. అదీ ఎన్నో విజయాలు సాధించిన కస్తూరి శివరావు(1913-1966) అనే గుణసుందరికథ కథానాయకుని కథ అలా ముగిసిపోయింది.