సంక్షోభం దిశగా కర్ణాటక ప్రభుత్వం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ రాజీనామా చేయగా.. తాజాగా మరో 11 మంది శాసనసభ సభ్యులు అదే బాట పట్టారు. ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి తదితరులు తమ రాజీనామా పత్రాలతో స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్‌ అందుబాటులో లేరు. ఆయన వచ్చిన తర్వాత ఏ క్షణమైనా వీరు రాజీనామాలు సమర్పించే అవకాశముంది. కాగా.. తాజా పరిణామాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదముంది.

సంక్షోభంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌
కర్ణాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 సీట్లలో గెలిచింది. కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదించడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆనంద్‌ సింగ్‌ రాజీనామాతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 116కు పడిపోయింది. తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్‌ ఆమోదిస్తే కూటమి బలం 105కి పడిపోతుంది. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు మధ్యంతర ఎన్నికలు అనివార్యం. అలా కాకుండా గవర్నర్‌ బలనిరూపణ కోసం ఒకవేళ భాజపాకు అవకాశం ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. అప్పటికి సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా బలనిరూపణ జరిగి భాజపా గట్టెక్కితే ఆ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి…

Share.

Comments are closed.

%d bloggers like this: